Monday, 17 October 2016

తోమా జీవితము గురించి క్లుప్తంగా....

యేసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండెను. ఈయన తోమా దిదుమగా పిలువబడేవాడు. తోమా అను మాటకు అరామిక్ భాషలో కవలలు అని అర్థము. దిదుమ అను మాటకు గ్రీకు భాషలో కవలలు అని అర్థము. కాబట్టి తోమా కవల పిల్లలలో ఒకరు అని బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొందరు యిది ఆయన బిరుదు అనియు, ఆయన అసలైన పేరు యూదా తోమా అనియు భావించుచున్నారు.

యోహాను తోమాకు బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమా గురించి వ్రాసాడు.

మొట్టమొదటగా తోమాను గురించి యోహాను సువార్త 11:16 లో చూడగలం. యేసు లాజరును చూడగోరి యూదయ బయలుదేరుటకు తీర్మానించినప్పుడు, ప్రాణాపాయము సంభవించునని శిష్యులు సంశయించిరి. అప్పుడు యేసు లాజరు చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు. “ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తోమా తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు. యేసును వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంఛ తోమా మాటలలో కనిస్తుంది. అంతేగాక యితడు అచంచల ధైర్య సాహసాలు గలవాడు, ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, బోధకుడుగా గుర్తించినవాడు. కానీ, ఆయన సందేహించు స్వభావము గలవాడుగా మనమందరమూ తోమాను చూస్తాము.

తోమా ప్రశ్నవల్లనే యావత్ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైన సందేశం లభించింది. యోహాను 14:1-4 లో క్రీస్తు తాను పరలోక రాజ్యమునకు వెళ్లి ఒక స్థలమును సిద్దపరచనై యున్నానని చెప్పెను. “నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.” అయితే తోమాకు ఏమియు అర్థము కాలేదు. అంతకు ముందు – నాయందు విశ్వాసముంచుడి అని క్రీస్తు చెప్పినను, సంపూర్ణ విశ్వాసముతో ఆయన మాటను తోమా అంగీకరించలేకపోయెను. “ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలగు తెలియును” అని అపనమ్మకంతో ప్రభువును అడిగాడు. అందుకు యేసు – “నేనే మార్గమును, సత్యమును, జీవమును.” అని  వక్కాణించెను.

సిలువ మరణం తర్వాత పునరుత్తానుడైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. తర్వాత తోమా  వచ్చినప్పుడు ఈ పునరుత్థాన వార్తను విని, నమ్మక తన అపనమ్మికను వ్యక్తపరిచెను. “నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను” అని తన సందేహమును ఖండితముగా చెప్పెను.

8 దినములు అయిన తర్వాత శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి తోమానే పిలిచెను. అతడి సందేహాన్ని నివృత్తి చేశాడు.

ఆ చేతులలోని గురుతులను చూడగానే తోమా విశ్వాసియై ప్రభువు పాదాల యొద్ద “నా ప్రభువా, నా దేవా” అని మోకరిల్లిపోయాడు.

అలా నమ్మి అచంచలంగా నిలిచి అమోఘమైన సువార్త సేవ చేసాడు. స్థిరమైన విశ్వాసము కలిగి యితర శిష్యులకంటే ఎక్కువ దూరము పయనించి క్రీస్తు కొరకు మరణించేంత మనో ధైర్యమును కలిగి జీవించాడు.

తోమా సేవ :
మెసపతోమియానందున్న ఎడేస పట్టణములో తన సేవను ప్రారంభించిన తోమా అపోస్తలుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళెను. అటు తర్వాత తాను మాత్రము ఒంటరిగా పారశీక దేశమందున్న అబియాబెనిలో సేవ చేయుటకు వెళ్ళెను. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారమును బట్టి పరస్పర సంబంధముండెను. యిదంతయు పారశీక దేశము మీదుగానే జరుగుచుండెను.

మన దేశమును గురించి వినిన తోమా బయలుదేరి భారతదేశానికి వచ్చెను. క్రీ.శ. 49 లో గాందారమును (పంజాబ్) పరిపాలించిన రాజైన సంద పోరస్ దగ్గర కట్టడ నిపుణునిగా చేరెను. యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమా యేసు నామంలో అతనిని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తును అంగీకరించెను.

అయితే గుషానీయుల దాడిని బట్టి తోమా గాంధార సంఘమును శాంతియాస్ అను డీకన్ చేతికి అప్పగించి, సోకోటిర అనే లంకకు వెళ్ళెను. అక్కడ నుండి క్రీ.శ. 52 లో వర్తక ఓడ ఎక్కి మలబార్ (కేరళ) సముద్ర తీరమందున్న గిరంగనూర్ దిగెను. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపమున ఉండెను.

పాలూరు, గిరంగనూరు, పారూర్, కొకమంగళం, కాయల్, నిరణం, కొల్లం అను 7 స్థలములలో సంఘములను స్థాపించెను. ఈ సంఘములు తర్వాత మార్తోమా సంఘములు అనబడెను.

ఈ సంఘములను పరామర్శించుటకు యిద్దరిని అభిషేకించి వారికి భాద్యతలను అప్పగించిన తర్వాత తోమా తూర్పు తట్టు ప్రయాణము చేసెను. అనేక ప్రాంతములు తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించెను. పాండ్య రాజులలో ఒకరిని క్రీస్తును వెంబడించుటకు నడిపించినట్లుగా చెప్పబడుచున్నది.

తర్వాత మన దేశపు తూర్పు దరికి చేరిన తోమా అక్కడ నుండి సముద్ర మార్గముగా చైనా దేశము వెళ్లి అక్కడ కొంత కాలము సేవ చేసెను. తరువాత తిరిగి మన దేశమునకు వచ్చి మద్రాసు పట్టణ ప్రాంతములో తన సేవను కొనసాగించెను.

మద్రాసు నడిబొడ్డు నుండి 10 కి.మీ. దూరానున్న సైదాపేట వద్ద చిన్నమలై కొండ ఉన్నది. తోమా సువార్త సేవకు ఈ కొండ కేంద్ర స్థానమై ఉన్నది. వేలాది మందికి పగలంతా వాక్య పరిచర్య చేసి, ప్రొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్లి ప్రార్ధనలో గడిపేవాడు. ఆ గుహ యిప్పటికి అలానే ఉన్నది.

తోమా వాక్యము వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తం చేతి కర్రతో కొండను తట్టి యిచట నీటి జలను సృష్టించినాడు. సైదాపేటకు నేటికి ఈ ధార ఒక వర ప్రసాదమే. ఈ కొండ దిగువ పాదముద్ర ఉన్నది. ఈ ముద్ర తోమాదేనని కొందరి అభిప్రాయం.

హతసాక్షిగా తోమా....
మైలాపూరులో తోమా చేసిన సేవను చూసిన కాళిక దేవత గుడి పూజారులు ఆయనను చంపుటకు పన్నాగములు పన్నిరి. మిస్థి అను రాజు కూడా వారికి తోడ్పడెను.

తోమా తన వాడుక చొప్పున కొండ గుహలోకి వెళ్లి ప్రార్ధించుచుండగా పూజారులు వచ్చి తోమాను బల్లెముతో పొడిచారు. తీవ్రముగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ, ప్రస్తుతము “సెయింట్ థామస్ మౌంట్” అని పిలువబడుచున్న స్థలమునకు చేరి అచ్చట నాటబడియున్న సిలువను హత్తుకొని ప్రాణములు విడిచెను. యిది నగరానికి 13 కి.మీ. దూరంలో మీనంబాకం విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్నది. క్రీ.శ. 72 వ సంవత్సరం జూలై 3 వ తేదీన తోమా మరణించినాడని చెప్పబడుచున్నది.

తోమా చంపబడినప్పుడు వేలాది మంది కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి రాజు మహదేవన్ తన కుమారుడు విజయన్ తో కలిసి ఆ చోటికి వచ్చి పరిశుద్దుడైన తోమా మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూరులోని శాంతోంకు తీసుకువెళ్ళి, తోమా తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్ని చర్చిలో సమాధి చేయించారు. నేడును ఆ సమాధిని చూడవచ్చు. సమాధి రాళ్ళు అవి మొదటి శతాబ్దానికి చెందినవని రుజువు పరచు చున్నవి.

క్రీ.శ. 394 లో తోమాగారి ఎముకలు ఎడాస పట్టణమునకును, తర్వాత ఇటలీ దేశమందున్న వోర్ డోనాకును కొనిపోబడెను. ప్రస్తుతము యిచట పెద్ద ఆలయము కట్టబడి యున్నది.

క్రీ.శ. 1552 లో పోర్చుగీసువారు మైలాపూరు ఆలయమందు తోమా ఎముకలలో ఒకటి, మరియు ఆయనను చంపిన బల్లెము యొక్క మొనను చూచి వాటిని గోవాకు తీసుకొని వెళ్ళిరి. (శాంతోం అనగా పోర్చుగీసు భాషలో సెయింట్ తోమా అని అర్థం. తోమా భారత దేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు, మైలాపూరు మాత్రమే ఉన్నది.)

శిథిలమైన ఆ ఆలయము యొద్ద 1893 నుండి 1896 వరకు కట్టబడిన పెద్ద ఆలయము “శాంతోం కేతిడ్రాల్” అను పేరుతో నేడును మైలాపూర్ నందు కనబడుచున్నది.

అపోస్తలుడైన తోమా మరణించిన పెద్ద కొండలో క్రీ.శ. 1747 లో ఆయన ప్రార్ధించిన చిన్న కొండలో (లిటిల్ మౌంట్ ) క్రీ.శ. 1612 లో కట్టబడిన ఆలయములు నేడును మనకు కనబడుచున్నవి.

ఈ విధంగా తోమా యోధానుయోధుడుగా ఎచ్చటో ఉన్న బబులోను నుండి పరిశుద్దాత్మ నడిపింపుతో మన భారత దేశానికి వచ్చి యిచ్చట నాటిన పరిశుద్దాత్మ విత్తనాలు ఆసియా ఖండమంతటికీ ప్రాకి మహావృక్షం కావడానికి దోహదం చేసిన మహత్తర అపోస్తలుడు.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

"నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." దానియేలు 12:3.

- Posted by Rev.Prathibha medam