Sunday, 25 September 2016

ఎందుకంత వెర్రితనం?

మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికి వందనములు.

కీర్తనలు 118:8,9 వాక్యాలు బైబిలులో మద్యలో ఉన్నాయి. అయితే కొంతమంది ఈ వాక్యాల్ని ఆధారం చేసుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ఏదైనా రోగం వచ్చినా, సమస్యలు వచ్చినా ఎవరితో చెప్పకుండా, మనుషులతో కలవకుండా, దేవుని ఆశ్రయించడం మేలని, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. నీకు ఏదన్నా రోగం వస్తే ముందుగా ప్రార్థన చేసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళు. నీ దగ్గర డబ్బులు ఉండి కూడా డాక్టర్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్ళకుండా, దేవుడు నన్ను బాగు చేస్తాడులే అనుకోవడం బుద్ధిహీనత. డాక్టర్ దేవుడు ఇచ్చిన కృప, రోగం గల వారికి వైద్యుడు అవసరం అని మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా చెప్తున్నారు (మత్తయి 8:12).

రోగం విషయంలో మాత్రమే కాదు, నీకు ఏదైనా సమస్యలు వస్తే, మీ తల్లి తండ్రులతో, ఆత్మీయ స్నేహితులతో చెప్పు, వారి సూచనలు సలహాలు తీస్కో, ఆ సమస్య గురించి దేవుని సన్నిదిలో ప్రార్ధన చెసుకో. దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీకు మార్గం చూపిస్తారు.

ఒక రోజు ఒక ఊరిలో వరదలు రావడంతో ఆ ఊరు నీళ్ళలో మునిగిపోవడానికిసిద్దముగా ఉంది. ఆ ఊరిలో జాన్సన్ అనే క్రైస్తవుడు ఉన్నాడు, అతని ఇంటిలోనికి కూడా నీరు వచ్చాయి. అప్పుడు అతను దేవుడా నాకు సహాయం చేయి అని ప్రార్థన చెసాడు. అంతలో ఒక పడవ వచ్చి అతని ఇంటి ముందు ఆగింది. అప్పుడు జాన్సన్ ని ఈ పడవలోకి రా అని పడవలోని వారు పిలిచారు. అప్పుడు ఈ జాన్సన్ నేను రాను మీరు వెళ్ళండి, నన్ను దేవుడే రక్షిస్తాడు అన్నాడంట. కాసేపటికి జాన్సన్ ఇల్లు నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడు తను మిద్దె మీదికి వెళ్లి, ప్రభువా నన్ను కాపాడు అని మరలా ప్రార్థన చేసాడు. అంతలో ఇంకో పడవ వచ్చింది, ఆ పడవలో కూడా ఎక్కకుండా, దేవుడే నన్ను రక్షిస్తాడు అని అలాగే వాళ్ళతో కూడా చెప్పి పంపించేసాడు. అలా మూడు సార్లు జరిగింది. చివరికి జాన్సన్ చనిపోయి, పరలోకానికి వెళ్లి అక్కడ దేవుడిని అడుగుతున్నాడంట,యేసు ప్రభువా నన్ను వరదల నుంచి ఎందుకు రక్షించలేదు అని అడిగాడంట. అప్పుడు దేవుడు "పిచ్చివాడా" నీకోసం మూడు సార్లు పడవలు పంపించాను, నువ్వు ఆ మూడు సార్లు నీకు ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకోలేదు అని అన్నాడంట.
ఈరోజు చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఇలానే ఉంది. దేవుడు ఇచ్చిన అవకాశాలని వినియోగించుకోకుండా, నాకు నువ్వే రావాలి నువ్వే నా సర్వం, నాకు మనుషుల సహాయం వద్దు, మనుషులు మోసగాళ్ళు అని చెప్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారిని, తల్లి తండ్రులని, స్నేహితులను ప్రేమించడం మానేసారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు ఏదైనా సమస్య వస్తే మొదట ప్రార్థన చేసుకుని ముందుకు సాగు. 2 దినవృతాంతములు 13 వ అధ్యాయంలో యూదులకు, ఇశ్రాయేలియులకు యుద్ధం జరుగుతుంది. అందులో యూదుల సైన్యం 4 లక్షలు అయితే ఇశ్రాయేలియుల సైన్యం దానికి రెట్టింపుగా 8 లక్షలు ఉన్నారు. చూడ్డానికి ఇశ్రాయేలియుల సైన్యం బలంగా కనపడుతుంది. ఆ సమయములో యూదులు దేవుని ఆశ్రయించి యుద్ధం ప్రారంభిచారు. అద్బుత రీతిగా తమకంటే రెట్టింపు బలం గల ఇశ్రాయేలియుల సైన్యాన్ని యూదులు ఓడించారు, హల్లెలూయ.
నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యాలని చేయగలడు. ప్రార్థన చేసి నీ పనులు ప్రారంబించు, ఏ సమస్య అయినా కావొచ్చు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. సమస్య చాలా బలమైనది కావచ్చు, కాని బలవంతుడైన దేవుడు నీ పక్షముగా ఉండి యుద్దము చేస్తాడు (1 యోహాను 4:4) పాపాన్ని జయించలేకపోతుండొచ్చు, దేవుని అడుగు, నీ పాపం నుండి కూడా నిన్ను విడిపించి బలపరచగలడు (ఫిలిప్పి 4:13).

బహుశా మీరు కూడా మనుషులను నమ్మి మోసపోయి ఉండొచ్చు, నీ జీవితంలో మనుషులు నీకు సహాయం చెయ్యలేదేమో, నీ స్నేహితులు ఎవరు కూడా నిన్ను పట్టించుకోలేదేమో, నిన్ను మోసగించారేమో, అయినా బాధపడవద్దు, దేవుని ఆశ్రయించండి, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. గోలియాతు దావీదు కంటే బలవంతుడు, కాని యుద్దంలో దావీదు గెలిచాడు. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడి యుద్ధం చేసాడు (1సమూయేలు 17). అదే విధంగా నీ శ్రమలు, కష్టాలు ఎంతవైనా కానివ్వండి. దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు,దేవుని మీద ఆధారపడి ముందుకి సాగండి. అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక, ఆమెన్.