మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు.
యేసు క్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయనతోపాటుగా ఇద్దరు దొంగలను కూడా సిలువ వేసారని మన అందరికీ తెలిసిన విషయమే (మార్కు 15:27)
అయితే ఆ ఇద్దరు దొంగల్లో కేవలం మొదటి దొంగ మాత్రమే యేసు క్రీస్తును దూషించాడని, రెండో దొంగ యేసు క్రీస్తును దుషించలేదని చాలామంది అనుకుంటారు. లూకా 23:39-43 వాక్యాలు చదివితే అది వాస్తవమే అనిపిస్తుంది. కాని మరో చోట ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువును దూషించారని లేఖనాలు సెలవిస్తున్నాయి.
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము అని ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. (మత్తయి 27:42-44)
అంతే కాదు మార్కు సువార్త కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది.
ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి. (మార్కు 15:32)
ఈ వచనముల ప్రకారం ఇద్దరు దొంగలు కూడా యేసు క్రీస్తును దూషించారని స్పస్టముగా తెలుస్తున్నది.
కాని లూకా సువార్తలో మొదటి దొంగ యేసు క్రీస్తు ప్రభువును దూషించినట్లు, రెండో దొంగ మారుమనసు పొందినట్లు తెలుస్తుంది. మత్తయి, మార్కు సువార్తలలో వ్రాయబడినట్లు ఇద్దరు దొంగలు యేసు క్రీస్తును దూషించారు. అయితే అందులో యేసు క్రీస్తు ప్రభువును దూషించిన ఒక దొంగ మరి కాసేపటి తరువాత అదే యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు అనేది కూడా వాస్తవమే. అదే విషయాన్నీ లూకా తెలియజేసాడు.
రెండో దొంగలో ఈ మార్పు ఎలా వచ్చింది? కొన్ని క్షణాల క్రితం యేసు క్రీస్తును దూషించిన వ్యక్తి, మరి కాసేపట్లోనే ఎలా మార్పు చెందాడు?
తన నోటితోనే యేసు క్రీస్తును దూషించిన ఆ దొంగ, కొంత సమయం తరువాత అదే నోటితో ఆయనను రక్షకుడు అని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు, “ఎంత ఆశ్చర్యకరమైన విషయం!”
అంత తొందరగా ఆ దొంగలో ఈ మార్పు ఎలా వచ్చింది?
దానికి కారణం మన ప్రభువైన యేసు క్రీస్తు పలికిన ఆ ఒక్క మాటే ఆ దొంగలో మార్పు తీసుకొని వచ్చింది.
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. (లూకా 23:34)
అవును ఆ ఒక్క మాటే సిలువ మీద దొంగలో మార్పు తీసుకొని వచ్చింది.
తనని నిందిస్తున్నప్పటికి, కొడుతున్నప్పటికి, దూషిస్తున్నప్పటికి, నానా చిత్ర హింసలు పెడుతున్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభువు వారిని దూషించకుండా క్షమించమని ప్రార్థన చేసాడు, ఇది క్రీస్తు ప్రేమ.
ఈ మాట సిలువ మీద దొంగ హృదయాన్ని కదిలించింది. “నేను ఆయనను దూషించాను, నిందించాను, అయినప్పటికీ మమ్మల్ని (నన్ను) క్షమించమని ప్రార్థన చేసాడు.” నిజంగా ఈయన దేవుని కుమారుడే, లోక రక్షకుడే అని ఆ వ్యక్తి గ్రహించగలిగాడు,హల్లెలూయ.
యేసు క్రీస్తు పలికిన ఆ ఒక్క మాట ద్వారా, సిలువ మీద ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డాడు.అదే విధంగా మన మాటల ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులు రక్షించబడే అవకాసం ఉంది. క్రీస్తును నమ్ముకొన్న మనం, క్రీస్తు ప్రేమను మన క్రియల్లో చూపెట్టినప్పుడుఅనేకులు రక్షణ పొందే అవకాసం ఉంది.
“మన ప్రవర్తనే కొన్ని సార్లు ఇతరులకు సువార్తగా మారుతుంది” అనే విషయాన్ని గుర్తించాలి. కనుక మన ప్రవర్తన విషయములో క్రీస్తు ప్రేమ కలిగి జాగ్రతగా జీవిద్దాము.
ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. (1పేతురు 2:21)
నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. (1తిమోతికి 4:12)