బైబిలు సత్య గ్రంథం అనడానికి చారిత్రక ఋజువులలో మొదట నిలిచేవి యోసీఫసు రచనలు. మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు ఫ్లేవియసు యోసీఫసు (క్రీ.శ. 37 - క్రీ.శ. 100) నీరో, వెస్పేషియను, టైటసు, డోమీషియను చక్రవర్తుల కాలంలో జీవించాడు. అతడు వ్రాసిన అమూల్యమైన చారిత్రక గ్రంథాల్లో ఒకటి “ ద యాంటిక్విటీస్ ఆఫ్ జూయిష్ వార్స్”. యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలనంతరం కొద్ది సంవత్సరాలకే యోసీఫసు జన్మించాడు కాబట్టే నాటి చారిత్రక, రాజకీయ, సామాజిక సత్యాల్ని కళ్ళకు కట్టినట్లు గ్రంథస్థం చేశాడు. ఎంతో అమూల్యమైన సమాచారం కలిగిన ఈ చారిత్రక గ్రంథం బైబిలులో పేర్కొనబడ్డ చారిత్రక సంఘటనలకి, స్థలాలకి సంబంధించి అత్యంత అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం ఇప్పటి వరకు పాశ్చాత్య ప్రపంచంలో మాత్రమే లభ్యం. ఇంతవరకు ఏ ఇతర భారతీయ భాషల్లోను అనువదింపబడని, ఏంతో విలువైన సమాచారం కలిగిన ఈ చారిత్రక గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే అభిలాషతో శ్రీ శ్యామ సుందరరావు గారు అనువదించి, “యూదుల యుద్ధాలు – యెరుషలేం విధ్వంసం” పేరుతో ప్రచురించటం జరిగింది.
• బైబిలును చారిత్రక కోణంలో చదివి, అర్థంచేసుకోడానికి,
• మొదటి శతాబ్ధపు రాజకీయ సామాజిక, ఆధ్యాత్మిక స్థితిగతుల పట్ల అవగాహన కలిగి ఉండడానికి,
• నాటి యూదామత పరిస్థితిని, క్రైస్తవ్య ఆవిర్భావ నేపథ్యాన్ని అర్థం చేసికోడానికి.
• యేసుక్రీస్తు సోదరుడు, మొట్టమొదటి యెరుషలేం సంఘ నాయకుడు అయిన యాకోబు గురించి, అన్న మొదలైన ప్రధాన యాజకుల గురించిన వివరాల్ని తెలిసికోడానికి,
• బైబిలులో పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సీనీయులు, జలోతీయులను గూర్చి తెలిసికోడానికి,
• బైబిలులోని పాత, క్రొత్త నిబంధనల్లో పేర్కొనబడిన ప్రవచనాల నెరవేర్పు తెలుసుకోవడానికి,
• సువార్తలలో పేర్కొన బడిన, ముఖ్యంగా మత్తయి 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పేర్కొనిన ప్రవచనాలు క్రీ. శ. 70 లో ఏ విధంగా నేరవేరినవో క్షుణ్ణంగా తెలిసికోవడానికి,
• చరిత్రలో భయంకరమైన యూదులు చీకటి కాలం గురించి, రోమా చక్రవర్తి టైటసు ఏ విధంగా మిలియన్ల కొలది యూదుల్ని వధించింది,
• క్రీ. శ. 73 లో మసాదా కోట కూల్చబడి వేల కొలది యూదులు ఏ విధంగా హతంయ్యింది, వేలకొలది యూదులు బానిసలుగా అమ్మబడినది,
• అసలు యెరూషలేం విధ్వంసం ఎందుకు జరిగింది? యూదుల ధ్వంసాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? యెరూషలేంలోని క్రైస్తవులు ఎలా తప్పించబడ్డారు?
• దేవుని తీర్పు ఎలా ఉంటుంది?
ఇత్యాది విషయాలను ప్రత్యక్ష సాక్షియైన యోసీఫసు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి రాసిన ఈ గ్రంథాన్ని ప్రతి బైబిలు పాఠకులు, బోధకులు, వేదాంత విద్యాభ్యాసకులు తప్పని సరిగా చదవాల్సిందే. బైబిలును చారిత్రక దృక్పథంతో పరిశీలించాలనుకొనేవారు, సాహితీ ప్రియులు తప్పక అనుబంధంగా కలిగి ఉండాల్సిన గ్రంథమిది. వేదాంత కళాశాలల్లో బోధనార్హమైన గ్రంథమిది.